చే గెవారా (Che Guevara)(జననం: జూన్ 14,1928-మరణం: అక్టోబర్ 9,1967) అసలు పేరు ఎర్నెస్టో గెవారా డి లా సెర్నా. ఇతడు దక్షిణ అమెరికా ఖండపు విప్లవకారుడు మరియు రాజకీయ నాయకుడు.ఇతడు పెట్టుబడిదారీ వ్యవస్థ తో పాటు సామ్యవాదం లోని సాంప్రదాయ వాదాన్ని కూడా వ్యతిరేకించాడు.ఫీడెల్ కాస్ట్రో నాయకత్వంలోని క్యూబా ప్రభుత్వం లో కాస్ట్రో తరువాత అంతటి శక్తివంతుడైన నాయకుడుగా చలామణీ అయ్యాడు. ఇతడు 1961 నుండి 1965 వరకు పరిశ్రమల మంత్రిగా పనిచేసి క్యూబా ప్రభుత్వ ఆర్థిక ప్రణాళికలను చాలావరకు నిర్దేశించాడు.
ఇతడు అర్జెంటీనా లోని రొసారియా అనే పట్టణంలో 1928 జూన్ 14న ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. 1953 లో బ్యూనస్ ఎయిర్స్ విశ్వవిద్యాలయం నుండి వైద్య విద్యలో పట్టా పొందాడు. ఆ తదుపరి మోటారు సైకిల్ పై దక్షిణ అమెరికా ఖండమంతటా పర్యటిస్తున్న సమయంలో ప్రజల జీవన స్థితిగతులను గురించి తెలుసుకున్నాడు. హింసాత్మక విప్లవమొక్కటే సామాజిక అసమానతలను తొలగించగలదని భావించాడు.
1954 లో గౌటెమాల దేశంలో ప్రజాబాహుళ్యపు అభ్యున్నతికి కృషి చేస్తున్న సామ్యవాద అనుకూల ప్రభుత్వంతో కలసి పనిచేశాడు. కానీ అదే సంవత్సరం అమెరికా సాయంతో జరిగిన కుట్ర మూలంగా ఆ ప్రభుత్వం కూలదోయబడటంతో మెక్సికో వెళ్ళిపోయాడు. ఈ ఘటనతో అతని హింసాత్మక విప్లవ దృక్పథం మరింత బలపడింది.
మెక్సికో లో ఫీడెల్ కాస్ట్రో నాయకత్వంలో అచటికి ప్రవాసం వచ్చిన క్యూబా విప్లవకారులతో చేతులు కలిపాడు. 1950 వ దశకం చివరలో అప్పటి క్యూబా నియంత బాటిస్టా కు వ్యతిరేకంగా కాస్ట్రో ఆధ్వర్యంలో జరిగిన గెరిల్లా పోరాటం(1956-1959)లో ముఖ్య పాత్ర పోషించాడు. డాక్టర్ గా మరియు మిలిటరీ కమాండర్ గా సేవలందించాడు. ఈ సమయం లోనే ఇతను 'చే' గా పిలువబడ్డాడు.గెవారా ఎవరినైనా పలకరించే సమయంలో చే అనే అర్జెంటీనా శబ్దాన్ని ఎక్కువగా వాడుతుండటంతో క్యూబన్ విప్లవకారులందరూ అతన్ని 'చే' అని పిలువనారంభించారు. అలా ఆ పేరు స్థిర పడిపోయింది.
ఈ పోరాటం విజయవంతమై కాస్ట్రో 1959 జనవరిలో క్యూబా ప్రభుత్వాధికారాన్ని చేపట్టినపుడు గెవారా పరిశ్రమల మంత్రిగా,క్యూబా జాతీయ బాంకు ప్రెసిడెంట్ గా పనిచేసాడు. క్యూబా ప్రతినిధిగా అనేక దేశాలు పర్యటించాడు. ఈ పర్యటనలలో భాగంగానే చే 1959 జూలై నెలలో భారతదేశం లో కూడా పర్యటించాడు. తృతీయ ప్రపంచ దేశాల మీద అమెరికా పెత్తనాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన చే గెవారా క్యూబా సామ్యవాద దేశం గా మారటానికి దోహదపడ్డాడు.
గెరిల్లా యుద్దం గురించి వివరించే తన రచనలలో వర్థమాన దేశాలలో రైతాంగ విప్లవోద్యమాలు నిర్మింపబడాలని కోరుకున్నాడు. పేద దేశాలలో విప్లవాన్ని వ్యాప్తిచేయ తలపెట్టిన చే 1965 లో క్యూబాలో తన అతున్నత స్థానాన్ని, హోదాని, పలుకుబడిని అన్నింటిని వదలి పెట్టి కాస్ట్రో వారిస్తున్నా వినకుండా దేశం నుండి అదృశ్యమయ్యాడు.
కొద్దిమంది అనుచరులతో రహస్యంగా ఆఫ్రికా దేశమైన కాంగో లో కొంతకాలం గడిపాడు. ఆ సమయంలో ఆ దేశం యొక్క తూర్పు ప్రాంతంలో గెరిల్లా తిరుగుబాటుకు ప్రయత్నించి విఫలుడయ్యాడు. 1966 చివరిలో మరలా దక్షిణ అమెరికా చేరి బొలీవియా దేశంలో మిలిటరీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న విప్లవకారులకు నాయకత్వం వహించాడు. ఈ సమయంలోనే బొలీవియన్ సైన్యం చేత చిక్కి వారిచే అక్టోబర్ 9,1967 న వల్లెగ్రాండె అనే ప్రాంతంలో చంపబడ్డాడు. ఆ నాటి నుండి చే గెవారా విప్లవానికి, తిరుగుబాటుకు చిహ్నమై ఎందరికో ఆరాధ్యుడయ్యాడు.
-----------AKULA RAGHAVENDRA cell:9985012181,9493312181
FOUNDER PRESIDENT
ANDHRAPRADESH STUDENT FEDERATION(APSF)
No comments:
Post a Comment